- నిర్మల్‌లో బీజేపీ పాదయాత్ర
- హాజరైన రాష్ట్ర ఇన్చార్జ్ బన్సల్
నిర్మల్, వెలుగు:కాంగ్రెస్ వాళ్లు గానీ, ఇతర పార్టీల వారెవరైనా వచ్చి సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) వద్దంటే వీపంతా సాఫ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచక వాదాన్ని అంతం చేద్దాం’ అంటూ నిర్మల్ లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మహా పాదయాత్ర నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
వివేకానంద చౌక్ వద్ద ఏర్పాటుచేసిన సభలో సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనూ ‘సర్’ ప్రక్రియ జరిగిందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఎస్‌ఐఆర్ పేర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఓటు చోరీ జరగకపోయినా సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం బ్రెయిన్ చోరీ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకపోయినా ఆ పేరును తగిలించుకున్నారని, ఆయన నేమ్ చోరీకి పాల్పడ్డారని విమర్శించారు.
కేంద్రాన్ని అస్థిరపరిచే కుట్ర: ఏలేటి హేశ్వర్‌రెడ్డి
కాంగ్రెస్ నేతలు విదేశీ ఎజెండా అమలు చేస్తూ కేంద్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌తరహాలో రాజకీయ అస్థిరత సృష్టించాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌కు మూటలు మోసే మేస్త్రీగా మారారని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని మరిచి పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పటేల్, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మ, ఎంపీలు ఈటల రాజేందర్, నగేశ్, ఎమ్మెల్యే లు రామారావు పటేల్, పాయల్ శంకర్, హరీశ్‌బాబు, సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ పాల్గొన్నారు.
